హైదరాబాద్: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' విజయంతో ఉత్సాహంగా ఉన్న విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం 'లెగసీ' షూటింగ్‌ను పూర్తి చేశారు. సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో కలాహి మీడియా పతాకంపై ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది.
చిత్రీకరణ ముగిసిన సందర్భంగా శనివారం విశ్వక్ సేన్ కొత్త పోస్టర్‌తో కూడిన ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.
యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.
అధికారం, కుటుంబం, ప్రేమ, నమ్మకద్రోహం చుట్టూ తిరిగే ఈ కథలో అనుకోకుండా రాజకీయ చక్రవ్యూహంలో చిక్కుకున్న వారసుడి పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.



