ఈసారి లండన్‌లో బతుకమ్మ పూలతో పాటు చేనేత కళ కూడా మెరిసింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌తో పాటు యూకేలోని పలు ప్రాంతాల్లో 'చేనేత బతుకమ్మ' వేడుకలు ఘనంగా జరిగాయి.

లండన్ వేడుకకు దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. అందరూ తెలంగాణ చేనేత దుస్తులు ధరించి వచ్చారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నేత కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

చేనేతకే పెద్దపీట

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల చెప్పారు. తమ పిలుపునకు స్పందించి సభ్యులంతా చేనేత దుస్తుల్లో రావడం స్ఫూర్తినిచ్చిందని ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు అన్నారు. చేపట్టిన కార్యక్రమాలతో ప్రవాసుల్లో సంఘానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఉపాధ్యక్షురాలు సుష్మున రెడ్డి తెలిపారు.

విదేశాల్లో ఉంటూనే తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నందుకు అతిథులు టాక్‌ను అభినందించారు. యూకేలోని తెలంగాణ వాసులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని ప్రశంసించారు.

గౌరీదేవిని పూజించే తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఈ ఏడాది అక్టోబర్ 10న ఎంగిలిపూలతో మొదలై, అక్టోబర్ 19న సద్దుల బతుకమ్మతో ముగిసింది.