జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడులోని ఏడు జిల్లాలకు పరిశీలకుడిగా ఆయనను నియమించింది.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకం జరిగింది. గతంలోనూ పలు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించిన అనుభవం తోట లక్ష్మీకాంతారావుకు ఉంది.

విద్యావంతుడిగా, రాజకీయ చతురత కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఐదు భాషలపై పట్టు ఉండటం ఆయన ప్రత్యేకత.

గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ తరఫున పరిశీలకుడిగా ఏఐసీసీ ఆయనను నియమించింది. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుల నియామకంలోనూ ఆయన పాలుపంచుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తనపై విశ్వాసంతో మరోసారి బాధ్యతలు అప్పగించడం పట్ల తోట లక్ష్మీకాంతారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.