పణాజీ (గోవా): జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి కొత్త ప్రాజెక్టుపై శనివారం అధికారిక ప్రకటన చేశారు. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో మీడియాతో మాట్లాడుతూ, రామాయణం ఆధారంగా ఒక యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయాలని భావిస్తున్నానని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ యానిమేషన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని అనిల్ రావిపూడి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం IFFI 2026లో ఇండియన్ పనోరమా మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగంలో ఎంపికైన ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి, కె. సుష్మిత, నటి కేథరిన్ త్రెసాతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడి ఇమేజ్‌కు తగ్గట్టుగా కుటుంబ భావోద్వేగాలతో పాటు హాస్యాన్ని సమన్వయం చేయడం పెద్ద సవాలని, హాస్యం ఎప్పుడూ సీరియస్ బిజినెస్ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.