అమరావతి / విజయవాడ: సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సుమారు మూడు గంటల పాటు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం 30 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకున్న ఆరు సంస్థల నుంచి ₹36,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ₹19,000 కోట్ల పెట్టుబడితో కియా మోటార్స్ రెండో ఆటోమొబైల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదించింది. శ్రీకాకుళం జిల్లాలో ₹13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ₹1,800 కోట్లతో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ పరిశ్రమలకు అనుమతి లభించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అనుమతుల జాప్యాన్ని తగ్గించేందుకు 'ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026'ను ఆమోదించారు.
రాజధాని అమరావతిలో సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల (హెచ్ఓడీ) టవర్ల నిర్మాణ వ్యయాన్ని ₹4,688 కోట్ల నుంచి ₹6,641 కోట్లకు సవరిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలోని గ్రామ పంచాయతీల మౌలిక వసతులకు ₹1,215 కోట్లు, శాఖమూరులో అమరావతి సంగమం ప్రాజెక్టుకు ₹626 కోట్లు, గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2కు ₹180.68 కోట్లు మంజూరయ్యాయి.
విద్యుత్ రంగంలో కోల్ ఇండియాతో ఏపీజెన్కో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు, కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల కేటాయింపునకు ఆమోదం లభించింది. అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించగా, రుషికొండ భవనాలను ఏడాదిలో 4 నెలలు ప్రజలకు తెరిచి, 120 రోజులు పీపీపీ విధానంలో లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.




