కడప జిల్లా నందలూరులో గురువారం జడ్పీటీసీ నామినేషన్ల దాఖలు సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు వర్గం, మేడా విజయశేఖర్ రెడ్డి వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కాల్పులు జరిగాయి. రెండు కార్లకు నిప్పు పెట్టారు, పలు బైకులు ధ్వంసమయ్యాయి. కాల్పులు ఎవరు జరిపారనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు వర్గాలకు చెందిన పలువురు, కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. ఇది టీడీపీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది.
వైసీపీ ఆరోపణలు
తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ, గిద్దలూరులో తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేశారని, ఆ దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయని పేర్కొంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో తమ నేతలు ముగ్గురిపై దాడి జరిగిందని కూడా ఆరోపించింది.
టీడీపీ ఏమంటోంది?
వైసీపీ ఆరోపణలను టీడీపీ తోసిపుచ్చింది. చాలా చోట్ల టీడీపీ కంటే వైసీపీయే ఎక్కువ నామినేషన్లు వేసిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అడ్డంకులు ఎదురైనట్లు ఆరోపణలు వచ్చిన 19 చోట్లపై కలెక్టర్లు, ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారని తెలిపారు.
ఈ పరిణామాల మధ్య వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు, సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగనుంది.




