సౌదీ అరేబియాలోని దమ్మామ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం సాయంత్రం దాడి జరిగింది. ఇద్దరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు భారతీయుడని, మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతుడి పేరు, సొంత రాష్ట్రం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ మరణాన్ని విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది.
అదే రోజు షైబా చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి యత్నం జరిగింది. సౌదీ రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను అడ్డుకున్నా, శకలాలు పడి ఇద్దరు మరణించారు. గాయపడినవారిలో ఒక భారతీయుడు ఉన్నారు. పౌర, ఇంధన కేంద్రాలపై దాడులను భారత్ ఖండించింది.
కుటుంబాల్లో ఆందోళన
ఆరు గల్ఫ్ దేశాల్లో దాదాపు 30 లక్షల మంది తెలుగువారు ఉన్నారని ప్రవాస సంఘాల ప్రతినిధుల అంచనా. ఇది అధికారిక లెక్క కాదు. వరుస దాడుల వార్తలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
సాయం కోసం
- దాడుల సమయంలో ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
- దాడులు జరిగిన ప్రాంతాల ఫొటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడం సౌదీ చట్టాల ప్రకారం శిక్షార్హం కావచ్చని హెచ్చరించింది.
- తెలంగాణవారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను, హైదరాబాద్‌లోని జీఏడీ ఎన్ఆర్ఐ సెల్‌ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు, ప్రస్తుత చిరునామా, యజమాని వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలి.




