యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ (TFA) ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ పల్లె బతుకమ్మ సంప్రదాయాన్ని ప్రవాస మహిళలు ప్రతిబింబించారు.

ఈ సంబరాల్లో ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య నిత్యం నిమగ్నమై ఉండే మహిళలు ఒకచోట చేరి, తమ సొంత ఊర్లలో ఉన్నట్లుగా సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఆనందించారు. వారు బతుకమ్మ పాటలతో, ఆటపాటలతో అరబ్ నాట సందడి చేశారు.

ఈ వేడుకలకు భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త సౌమ్య గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో దౌత్యవేత్త డాక్టర్ బాలాజీ రామస్వామి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్, రామా రామానే ఉయ్యాలలో బతుకమ్మ ఉయ్యాలలో అంటూ బతుకమ్మ పాటలతో ఆటపాటల కోలాటాలతో ప్రవాసీయులను అలరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణ మహిళలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ ఉత్సవాలు తెలంగాణ ప్రవాసీయుల సామూహిక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించాయి. తమ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ఉంచడంలో TFA కృషిని ఈ వేడుకలు చాటిచెప్పాయి.