వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో విజయదశమి రోజైన బుధవారం రాత్రి శ్రీ భద్రకాళి–భద్రేశ్వరుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ భద్రేశ్వరుడు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలతో వేడుక నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు.
విజయదశమి పూజలు
విజయదశమి సందర్భంగా ఆలయంలో కలశోద్వాసన, సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించారు. భక్తులు జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకున్నారు.
దసరా రోజు సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణాన్ని చూసేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కల్యాణంతో ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
వేడుకలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




