డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ ప్లాన్ అమలు, వివిధ శాఖల నిధుల కేటాయింపులు, ఖర్చుల సరళిపై ఆయన ఆరా తీశారు.

నిధుల వినియోగంలో వ్యత్యాసాలు ఉన్న శాఖలతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని ఆర్థిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. నిధులు సక్రమంగా వినియోగపడేలా చూడాలని సూచించారు.

వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పురపాలక పరిపాలన, పంచాయతీ రాజ్, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ శాఖలను ప్రత్యేక పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఈ శాఖల పనితీరుపై దృష్టి సారించాలని చెప్పారు.

మిగిలిన నిధులను సరైన రీతిలో వినియోగించుకునేలా చూసేందుకు ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఖర్చుల తీరును సమీక్షిస్తామని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆదాయ వనరులను పెంచడం, ఖర్చులను నియంత్రించడం, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకోవాలని భట్టి పిలుపునిచ్చారు. కొత్త ఆదాయ వనరులను గుర్తించాలని సూచించారు.

ప్రజా వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, బడ్జెట్ ప్రణాళికను అభివృద్ధి, సంక్షేమ ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.