ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర మంత్రుల మధ్య అంతర్గత పోరు నడుస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఒకరి పదవిని మరొకరు తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రేవంత్ రెడ్డి పాలనలో ఉన్న లోపాలు, అవినీతి, అక్రమాలు, ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత వంటి అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి నివేదించారని జీవన్‌రెడ్డి తెలిపారు.
ఈ నివేదికల కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు మంత్రులను లక్ష్యంగా చేసుకున్నారని బీఆర్ఎస్ నేత పేర్కొన్నారు. వారి పదవులకు ముప్పు తెచ్చేందుకు సీఎం వ్యూహాలు రచిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దీనిలో భాగంగానే, మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో విఫలమయ్యారని ప్రజల్లో చూపించేందుకు రేవంత్ రెడ్డి తన ప్రణాళికను అమలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా చిత్రీకరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.



