శంషాబాద్ రూరల్, మధురానగర్ కాలనీలో శనివారం టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో ఇళ్లను కూల్చివేయడానికి వచ్చిన సిబ్బందిని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక నాయకులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు నిర్మాణాలను కూల్చివేయకుండా నిలువరించారు.
బీఆర్‌ఎస్ కొన్నమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు జీవో 111 సాకుతో నిర్మాణాలను కూల్చివేయడం సరికాదని హెచ్చరించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను ఎక్కడా కూల్చివేయలేదని శ్రీనివాస్ గుర్తు చేశారు. పేదల పక్షాన తమ పార్టీ ఎప్పుడూ నిలబడుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాలను కూల్చివేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.



