తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.

కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ ఈ ముగ్గురు కాంగ్రెస్ నాయకులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టులు చేశారని బీఆర్ఎస్ లీగల్ సెల్ పేర్కొంది.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులను పంపారు. ఇదే అంశంపై గతంలో ఒక దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో చేసిన పోస్టులను వెంటనే తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని బీఆర్ఎస్ లీగల్ సెల్ స్పష్టం చేసింది.

నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెచ్చరించింది.