బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఒక దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ విషయమై బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి సోమ భరత్‌కుమార్‌ ఆదివారం ఆ పత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేశారు.

అక్టోబర్‌ 17న ఆ పత్రిక మొదటిపేజీలో ‘కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించిందని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని, కేసీఆర్‌పై బురదజల్లే ఉద్దేశంతోనే ప్రచురించారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

ప్రచురించిన తప్పుడు కథనంపై 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేసింది. ఈ క్షమాపణను పత్రిక మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో స్పష్టం చేసింది.

ఆ పత్రికకు చెందిన డిజిటల్‌ వేదికలు, అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఈ క్షమాపణను వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి సోమ భరత్‌కుమార్‌ తన నోటీసులో పేర్కొన్నారు.