దేశంలో ప్రస్తుతం రెండో ఆజాదీ ఉద్యమం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి నాయకుల కృషితో రాజ్యాంగ నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువలను, ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.