కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు.

2026లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెద్దాపురం డివిజన్ పరిధిలో ఈ కళాశాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కలెక్టర్ రెవెన్యూ, జిల్లా పరిషత్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.

రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల కోసం కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. భద్రతా ప్రమాణాలు, ప్రవేశ మార్గాలు, బ్యారీకేడింగ్ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంపై కూడా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.