బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారి బాపట్ల–విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115–125 కి.మీ. వేగంతో, అప్పుడప్పుడు 140 కి.మీ. వరకు గాలులు వీస్తాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయానికి ఇది విశాఖకు సుమారు 820 కి.మీ. దూరంలో ఉంది.

రెడ్ అలర్ట్ జిల్లాలు

  • మంగళవారం: కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాం
  • బుధవారం: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, యానాం
  • తెలంగాణ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

సీఎం ఆదేశాలు

తుపాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. ప్రాణనష్టం ఉండకూడదని, ఆస్తి నష్టం వీలైనంత తగ్గించాలని చెప్పారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు పెట్టాలని, ప్రజల ఫోన్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలని, ప్రతి నాలుగు గంటలకు తుపాను బులెటిన్ ఇవ్వాలని ఆదేశించారు. సముద్రంలో ఉన్న పడవలన్నీ తీరానికి రావాలని, రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. కరెంటు సరఫరా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, బీచ్‌లకు పర్యాటకులను అనుమతించబోమని హోంమంత్రి అనిత తెలిపారు. వదంతులు నమ్మవద్దని, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలనే పాటించాలని అధికారులు కోరారు.