ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామ దళిత మహిళా సర్పంచ్‌ మడిపెల్లి రాజేశ్వరి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కులవివక్షను ఎదుర్కొన్నారు. ఆదివారం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమెను పలువురు మహిళలు అడ్డుకున్నారు.

2005 స్థానిక ఎన్నికల్లో నర్సింగాపూర్‌ గ్రామపంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన దళిత మహిళ మడిపెల్లి రాజేశ్వరి అన్ని పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం ఆమె గ్రామంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమె కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి నెత్తిన బతుకమ్మతో బయలుదేరారు.

అయితే, బతుకమ్మ ఆడనీయకుండా పలువురు మహిళలు ఆమెను అడ్డుకున్నారు. తమతో కలిసి బతుకమ్మ ఆడవద్దని వారు రాజేశ్వరిని నిరాకరించారు.