పోలీస్ యూనిఫాంలో డ్యాన్స్‌లు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో పోలీసులు యూనిఫాంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

పోలీస్ యూనిఫాంలో డ్యాన్సులు వేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని డీజీపీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు.

ఇకపై అటువంటి చర్యలను ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, యూనిఫాం గౌరవాన్ని కాపాడాలని డీజీపీ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.