ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, పుంగనూరుతో పాటు కడప, తిరుపతి జిల్లాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు సృష్టించడం లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం వంటి ఫిర్యాదులను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా పక్షపాతంగా వ్యవహరించినా అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. అవసరమైతే బదిలీ, విధి నుంచి తొలగింపు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఎన్నికల కమిషనర్ పునీత ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఈసీ అధికారులకు స్పష్టం చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ ఆదేశాల అమలుపై నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.



