ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పనులను ఆయన తనిఖీ చేశారు.

సర్ సి.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని సులభంగా అందించేందుకు వీలుగా తగినన్ని టేబుళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

అకాల వర్షాల నుంచి సామాగ్రిని రక్షించేందుకు పంపిణీ కేంద్రాల వద్ద వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షం వచ్చినా సామాగ్రి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం సిద్ధం చేస్తున్న స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పనులను ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిసి కెమెరాలను అమర్చాలని, పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరణ చేయించాలని అభిషేక్ గౌడ ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులకు నంబర్లు వేసి భద్రపరచాలని సూచించారు.