కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన పచ్చి మోసమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం బొంరాస్‌పేట మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేందర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులను ఎన్నికల స్టంట్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు.

కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం రైతుల అవసరాలకు ఏ మాత్రం పనికిరాదని ఆయన అన్నారు. ఈ పథకం డిజైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేశారా అని ఆయన ప్రశ్నించారు.

రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగమేనని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.