ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని రాయమాధరం వరకు గోదావరి జలాలను సరఫరా చేసి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏన్కూరు మండలాన్ని కరువు ప్రాంతాల జాబితాలో చేర్చాలని కూడా సంఘం కోరింది.
శనివారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ ఆధ్వర్యంలో సంఘం బృందం రాయమాధరం, తిమ్మరావుపేట, రాజలింగాల, బురద రాఘవపురం, లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇరువైపులా సాగు చేసి ఎండిపోతున్న వరి, ఇతర పంటలను వారు పరిశీలించారు.
గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు నాగార్జున సాగర్ ఎడమ కాలువపై తిమ్మరావుపేట, రాయమాధరం మధ్య ఉన్న ఎస్కేప్ ఛానల్ ద్వారా సరఫరా చేయడంతో రైతులు సాగర్ ఎడమ కాలువ ఇరువైపులా వరి పంట సాగు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ జలాల విడుదల వల్ల ఏన్కూరు, కొణిజర్ల, ఖమ్మం అర్బన్ మండలాల్లో పంటలు సాగు అయ్యాయి.
అయితే, గత ఇరవై రోజుల నుంచి జిల్లా ఇరిగేషన్ అధికారులు గోదావరి జలాలను తిమ్మరావుపేట ఎస్కేప్ ఛానల్ ద్వారా కాకుండా సిరిపురం మేజర్ నుంచి తరలిస్తున్నారని రైతు సంఘం ఆరోపించింది. దీనివల్ల సాగర్ ఎడమ కాలువ ఇరువైపులా, ఇతర వాగులు, వంకల కింద పంట చేతికి వచ్చే దశలో నష్టం జరిగే అవకాశం ఏర్పడిందని పేర్కొంది.
మరో నెల రోజుల పాటు గోదావరి జలాలను సాగునీరుగా అందించి రైతులను ఆదుకోవాలని సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఏన్కూరు మండలం లేదని, అనేక గ్రామాల్లో వర్షాధారంగా పంటలు సాగు అవుతున్నందున ఏన్కూరును కరువు మండలాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది.



