నిర్మల్ జిల్లా కుభీర్ మండలం మాలేగాం సమీపంలో సుద్దవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను పంటలకు వినియోగించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడంతో రైతులు శుక్రవారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ మోటార్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుకు భూములిచ్చిన తమకు నీళ్లివ్వరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మాలేగాం, కుంభి, సాంవ్లి, న్యూ సాంవ్లి, నిగ్వ, మీర్జాపూర్ తదితర గ్రామాల రైతుల భూములు సుద్దవాగులో ముంపునకు గురయ్యాయి.
ముంపునకు గురైన భూములు కాకుండా మిగిలిన భూముల్లో రైతులు పసుపు, మిరప, పత్తి, కంది వంటి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ పంటలకు సుద్దవాగు బ్యాక్‌వాటర్‌ను వినియోగిస్తున్నారు.
పంటలు ఎండిపోతే చావే దిక్కు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుద్దవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను పంటలకు వినియోగించొద్దని, మోటర్లు తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తమ భూములను ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన తర్వాత కూడా సాగునీరు అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నిర్మల్ జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.



