ఉద్యోగాల కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నం యువకులు ఐదుగురు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో రష్యా సైన్యంలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురిని దాదాపు రెండు నెలల క్రితమే యుద్ధ రంగానికి పంపారని, వారి ఆచూకీ తెలియడం లేదని డెక్కన్ క్రానికల్ రాసింది. మిగిలిన ఇద్దరినీ రెండు రోజుల్లో పంపవచ్చని వారు భయపడుతున్నారు.
వీడియోలో ఏం చెప్పారు?
- ఆర్మీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి నమ్మించాడని ఆరోపించారు.
- అర్థం కాని రష్యన్ భాషా పత్రాలపై సంతకాలు చేయించారని, ఉద్యోగానికి బదులు సరిహద్దు వైపు తీసుకెళ్లారని చెప్పారు.
- ‘బహుశా ఇవే మా ఆఖరి మాటలు కావచ్చు’ అంటూ తమను భారత్‌కు తీసుకురావాలని ప్రధాని మోదీని వేడుకున్నారు.
వీడియోలో మాట్లాడిన యువకుడు గాజువాక మండలం దువ్వాడ సమీపంలోని కాలనీకి చెందిన వంశీ అని, ఆయనతో పాటు స్నేహితుడు సతీశ్ మాత్రమే ప్రస్తుతం మిగిలారని ఈటీవీ భారత్ తెలిపింది. తన కొడుకును కాపాడాలని వంశీ తల్లి సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
ప్రభుత్వ స్పందన
మంత్రి నారా లోకేశ్ వీడియోను ఎక్స్‌లో పంచుకుని, బాధితులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులను సంప్రదించాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. కేంద్రం, విదేశాంగ శాఖ నుంచి ఇంకా స్పందన రాలేదు. రష్యా సైన్యంలోకి భారతీయులను చేర్చుకోవడాన్ని ఆపాలని రష్యాను కోరామని, ఇలాంటి ఉద్యోగ ఆఫర్లు ప్రమాదకరమని విదేశాంగ శాఖ 2025 సెప్టెంబర్‌లో హెచ్చరించింది.




