దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పండుగ సంప్రదాయాల పేరుతో పక్షులను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం వంటివి చేయరాదని అధికారులు స్పష్టం చేశారు.

వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా పాలపిట్టను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరింది.

పాలపిట్ట ప్రదర్శనలను నివారించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా అవగాహన పోస్టర్లను రూపొందించింది. ఈ పోస్టర్లను బంజారాహిల్స్ పోలీసులకు అందజేశారు.

మండపాల నిర్వాహకులకు ఈ పోస్టర్ల ద్వారా సూచనలు అందిస్తున్నారు. పక్షులను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.