రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుకు తాగునీటి సరఫరా కోసం కృష్ణా జలాలను వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో తలెత్తే తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా, డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీటిని, తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను సరఫరా చేయాలని జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అయితే, కృష్ణా జలాలను ఎక్కడి నుంచి తరలించాలనే అంశంపై జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కృష్ణా మూడో దశ నుంచి ఈ జలాలను తరలించాలా, లేక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి తరలించాలా అనే దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జలమండలి ప్రాథమికంగా డీపీఆర్‌కు సిద్ధమవుతోంది.