గోదావరి-కావేరి నదీజలాల అనుసంధానం పేరిట తెలంగాణపై కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు.

ఈ కుట్రకు సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. బనకచర్ల-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు విఫలమవడంతో గోదావరి నదీజలాలపై ఏపీ ప్రభుత్వం కన్నేసిందని హరీశ్‌రావు అన్నారు.

గోదావరి-కావేరి లింకు ప్రాజెక్టును పోలవరం నుంచి చేపట్టాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాది అక్టోబర్‌ 7న కేంద్రానికి లేఖ రాశారని ఆయన తెలిపారు.

తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాల దోపిడీ మొదలుపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్‌ 3న ఢిల్లీలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఇచ్చంపల్లి-కావేరి లింకులో 50 శాతం నీళ్లు ఇస్తేనే అనుసంధానానికి ఓకే చెబుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.