బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహిషాసురమర్ధిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. రాత్రి నుంచే భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చారు.
అమ్మవారి దర్శనం కోసం ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.



