యునైటెడ్ కింగ్డమ్ తెలంగాణ అసోసియేషన్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు అక్టోబర్ 19, 2026న ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యురాలు రూత్ క్యాడ్బరీ, మాజీ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ, హౌన్స్లో మేయర్ రంజిత్ గిల్, హౌన్స్లో కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
స్థానిక యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ నాయకుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణీయులు సమాజ సేవలో క్రియాశీలకంగా పాల్గొంటారని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని రత్నాకర్ కడుదుల గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో, మాజీ మంత్రి కేటీఆర్ కృషికి మద్దతుగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చేనేత బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.



