అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మరింత తగ్గింది. అమెరికా వాణిజ్య శాఖ పరిధిలోని అంతర్జాతీయ వాణిజ్య విభాగం (ఐటీఏ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్, ఎం వీసాలపై 25,321 మంది భారతీయ విద్యార్థులు అమెరికా చేరుకున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సంఖ్య 41,540.

లెక్కలు ఏం చెబుతున్నాయి?

  • ఏడాదిలో 39 శాతం తగ్గుదల. కొవిడ్ కాలమైన 2020 తర్వాత ఆగస్టు నెలలో ఇదే అత్యల్పం. 2020 ఆగస్టులో 2,908 మంది మాత్రమే వెళ్లారు.
  • 2023 ఆగస్టులో రికార్డు స్థాయిలో 93,833 మంది వెళ్లారు. దానితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం తక్కువ.
  • 2024 ఆగస్టుతో పోలిస్తే 66.2 శాతం తక్కువ.
  • 2025లో భారతీయ దరఖాస్తుదారుల ఎఫ్-1 వీసా తిరస్కరణ రేటు 61 శాతానికి చేరిందని ఒక విశ్లేషణ చెబుతోంది.

కారణాలు ఏంటి?

ట్రంప్ రెండో ప్రభుత్వంలో వలస నిబంధనలు కఠినమవడం, పత్రాల పరిశీలన పెరగడం, వీసా ఇంటర్వ్యూ స్లాట్లు తగ్గడం ఈ తగ్గుదలకు కారణాలని నివేదికలు చెబుతున్నాయి. ఇంటర్వ్యూలు ఎక్కువసేపు సాగడం, నేపథ్య తనిఖీలు, జాప్యం, తిరస్కరణలు ఎదురవుతున్నాయని దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి వల్ల విదేశీ చదువుకు భారీగా ఖర్చు చేసేందుకు కుటుంబాలు వెనకాడుతున్నాయి.

అమెరికాకు బదులు జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి దేశాలతో పాటు దేశంలోని విశ్వవిద్యాలయాల వైపు విద్యార్థులు చూస్తున్నారు. అమెరికా చదువుకు ప్రణాళిక వేసుకుంటున్న తెలుగు కుటుంబాలు ఈ మార్పును గమనించాల్సి ఉంది.