మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని 13, 23వ వార్డులకు మిషన్ భగీరథ నీటి సరఫరా పది రోజులుగా ఆగిపోయింది. దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యను మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. తాగునీరు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఆర్వో సలాం ఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్వో హామీ మేరకు మహిళలు తమ ఆందోళనను విరమించారు. త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



