విజయవాడలో గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పెద్దలు నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవాల’పై జనతంత్రం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉత్సవాల వెనుక పాలకుల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని జనతంత్రం ఆరోపించింది.
నవరాత్రి వేడుకల వెలుగులో నగరంపై ప్రేమ కాంతులు కురిపిస్తున్నామని పాలకులు ఆశిస్తున్నారని జనతంత్రం పేర్కొంది. అయితే, ఈ తొమ్మిది రాత్రుల అట్టహాసం మాటున నగర భవిష్యత్తుకు పెద్దలు ఉరితాళ్లు పేనుతున్నారని విమర్శించింది.
విజ్ఞులైన విజయవాడ ప్రజలు ఈ వంచనా శిల్పాన్ని అంచనా వేయలేరనుకోవడం వెర్రితనమే అవుతుందని జనతంత్రం అభిప్రాయపడింది. ప్రజలను మోసం చేయాలని పాలకులు చూస్తున్నారని ఆరోపించింది.
సదాశయంతో నగరానికి ఉత్సవాలు నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని జనతంత్రం స్పష్టం చేసింది. కానీ, గ్రామదేవతకు బలి ఇచ్చే ముందు మేకపోతుకు ముస్తాబు చేసి దండవేసి ఊరేగించే ఉత్సవం వంటిదైతే మాత్రం తప్పకుండా అభ్యంతరం ఉంటుందని హెచ్చరించింది.



