స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపేట ఉప పోలీసు సూపరింటెండెంట్ (డీఎస్పీ) సుంకర మురళీమోహన్ రావులపాలెం మండలంలోని గోపాలపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు.
పోలింగ్ కేంద్రంలో కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల సమయంలో ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని డీఎస్పీ ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన బందోబస్తు ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.
విధుల నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రావులపాలెం సీఐ రమేష్ బాబు, స్థానిక ఎస్సైలకు డీఎస్పీ మురళీమోహన్ సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.



