బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్‌ అధిష్టానానికి కిస్తీలు కట్టకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్‌ రెడ్డికి పట్టుకుందని కేటీఆర్‌ అన్నారు. ఈ కిస్తీలు చెల్లించేందుకే విదేశీ బొగ్గు కొనుగోలులో వచ్చే కమీషన్ల ద్వారా నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సింగరేణిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రులు టెండర్లు, కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఆస్ట్రేలియా బొగ్గు కొనుగోలుపై ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానానికి చెల్లించాల్సిన ఈఎంఐలు వసూలు చేసేందుకే రాష్ట్రంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి రికవరీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.