రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్నీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ వారిని దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవసరమైన నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు తమ ఓటు ద్వారా సమాధానం చెప్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇది రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.



