రాజవొమ్మంగి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా లోతా రామారావుకు గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది. ఆదివాసీ జేఏసీ కన్వీనర్ వంతు బాలకృష్ణ మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు.
ఆదివాసీ జేఏసీ తొలుత తనను జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, భవిష్యత్తు ఉద్యమాల కోసం లోతా రామారావుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వంతు బాలకృష్ణ వెల్లడించారు.
సోమవారం రాత్రి రాజవొమ్మంగిలో లోతా రామారావు అధ్యక్షతన గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వంతు బాలకృష్ణతో పాటు పలువురు ఆదివాసీ నేతలు హాజరయ్యారు.
లోతా రామారావు ఏజెన్సీలో ఆదివాసీ హక్కులు, చట్టాలు, 1/70 యాక్ట్, జీవో నెంబర్ 3 అమలు కోసం నిస్వార్థంగా పోరాడుతున్నారని నేతలు పేర్కొన్నారు.
అలాగే, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, ఏజెన్సీ ప్రాంత పల్లెల్లో రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కారణాల వల్ల లోతా రామారావుకు తమ పూర్తి మద్దతు ప్రకటించినట్లు వంతు బాలకృష్ణ స్పష్టం చేశారు.



