దేశంలో మావోయిజం ముగింపు దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు తగ్గుముఖం పట్టాయని, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్య ఇంకా ఉందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో శనివారం జరిగిన 78వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల దీక్షాంత్ పరేడ్‌కు గోవింద్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గత 50 ఏళ్లుగా వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొందని గుర్తుచేశారు.
జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే మాట్లాడుతూ 78వ బ్యాచ్‌లో 151 మంది ట్రైనీలు ఉన్నారని తెలిపారు. వీరిలో 135 మంది ఐపీఎస్ అధికారులు, 16 మంది పొరుగు దేశాలకు చెందిన అధికారులు ఉన్నారని పేర్కొన్నారు.
ఈ ట్రైనీలకు 45 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని డైరెక్టర్ సుజిత్ పాండే వివరించారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో ఈ అధికారులు తమ వంతు కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



