ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో భావోద్వేగానికి లోనయ్యారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి విషయంలో ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
సాలూరు మున్సిపాలిటీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీని అందించిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇది చాలా కాలం తర్వాత జరిగిందని ఆమె గుర్తు చేశారు.
అలాంటి సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు కలత చెందుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ఈ ఆవేదనను భరించలేకపోతున్నానని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై అధిష్ఠానం పునరాలోచన చేయాలని కోరారు.
సాలూరులో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అధిష్ఠానం పునరాలోచన చేసేలా కృషి చేయాలని ఆమె కోరారు.



