సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
తెలంగాణ సంప్రదాయంలో ఆడపడుచులు ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో పాటు గ్రామమంతా రకరకాల పూలతో బతుకమ్మలు చేసి ఆటపాటలతో పండుగను జరుపుకుంటారని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఇది వరుసగా రెండోసారి అని సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. పూర్వీకులు అందించిన ఈ బతుకమ్మ పండుగను మరింత సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆమె తెలంగాణ ఆడపడుచులకు పిలుపునిచ్చారు.
బతుకమ్మ వంటి సంప్రదాయ వారసత్వాన్ని భావితరాలకు అందించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కోరారు. ఆమె బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయకుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు అత్తలూరి అరుణ, ఏ.రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు ఉమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, మర్యాద రమాదేవి, రచన ముడుంబై, ఎన్.శ్రీనివాసరెడ్డి, అశోక్ దయ్యాల, అమిత్ బట్టు, సైకాలజిస్ట్ డాక్టర్ ఛాయా లతతో పాటు పలువురు సీనియర్ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



