శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను వారు దర్శించుకున్నారు.
శ్రీదుర్గాదేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణలో మంచి వర్షాలు కురిసి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీ దుర్గా భవాని దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో బతుకమ్మ ఘాట్లను కూడా మంత్రి ప్రారంభించారు.



