పాలమూరు ప్రాంతానికి సంబంధించిన నీటి కేటాయింపుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. తన రాజకీయ గురువైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తానని, అయితే నీటి హక్కుల విషయంలో మాత్రం వెనకడుగు వేయనని ఆయన ప్రకటించారు.

జడ్చర్లలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిరుధ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రాంత ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని, వాటి కోసం ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి నెలకొన్న వివాదంపై అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. ఈ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టారు.

ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనను తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై తమ నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.