స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీరు 'హిట్ అండ్ రన్' లాంటిదని, ఆయన ఆలోచనా ధోరణి రాష్ట్రానికి ప్రమాదకరమని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియాతో అన్నారు.
సీఎం ఏమన్నారు?
- స్థానిక ఎన్నికలు జరగకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి అందకుండా పోయే ప్రమాదం ఉందని, ఎన్నికలను అడ్డుకునేందుకు 59 పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు.
- రౌడీయిజాన్ని, నేరాలను ప్రజలు సహించరని, తమ ప్రభుత్వానికి శాంతిభద్రతలే ముఖ్యమని అన్నారు.
- రాయచోటి, దర్శి, పులివెందుల, పుంగనూరు తదితర చోట్ల జరిగిన ఘటనల వెనుక వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు.
జగన్ ఏమంటున్నారు?
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఇంకా అడ్డంకులు ఎదురవుతున్నాయని, కొత్త ఆధారాలతో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగన్ శుక్రవారం తాడేపల్లిలో చెప్పారు. రాజంపేటలో 32 వార్డులకు గాను 14 చోట్ల, కడపలో 66 వార్డులకు గాను 13 చోట్ల మాత్రమే తమ పార్టీ పోటీ చేయగలుగుతోందన్నారు. గోరంట్ల, ధర్మవరం, పుంగనూరు సహా పలుచోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు.
ఆధారాలను గవర్నర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుకు అందజేశామని జగన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని వైఎస్సార్సీపీ తప్పుగా చూపిస్తోందని టీడీపీ అంటోంది. ఘర్షణలకు ప్రతిపక్షమూ కారణమేనని ప్రభుత్వం చెబుతోంది. కడప, తిరుపతి, రాజంపేట, మైదుకూరు మునిసిపాలిటీల్లో నామినేషన్లకు శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు.




