లండన్లోని భారత హైకమిషన్ వెలుపల శనివారం ప్రవాస భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా వారు ఖండించారు.
ర్యాలీలో పాల్గొన్నవారు త్రివర్ణ పతాకాలను చేతబూని, 'మోదీ, మోదీ', 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీరామ్' వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. విదేశీ గడ్డపై దేశ గౌరవాన్ని కాపాడేందుకే తాము ఇక్కడ సమావేశమయ్యామని వారు స్పష్టం చేశారు.
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, 'కాక్రోచ్ జనతా పార్టీ' చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రదర్శన జరిగింది. ఈసీ తీరును నిరసిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రవాస భారతీయులు మాట్లాడుతూ, విమర్శలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని, దేశ పరువు తీయవద్దని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
'రీచ్ ఇండియా' సంస్థ విద్యార్థులకు ఒక సూచన చేసింది. భారత్ వ్యతిరేక శక్తులతో కలవకుండా ఉండాలని కోరింది.



