కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కొన్ని విద్యాసంస్థలు, కళాశాల ప్రాంగణాల్లో జరిగిన దాడులు, గొడవలను పీసీసీ తీవ్రంగా పరిగణించింది.
అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి, యువజన విభాగాలు బాధ్యతగా ఉండాలి. కానీ కొందరు నాయకులు నిబంధనలు ఉల్లంఘించి విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో గొడవలకు దిగడంపై పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇకపై ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని పీసీసీ స్పష్టం చేసింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది.
విద్యార్థుల సమస్యలు, విద్యావ్యవస్థలోని లోపాలపై ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడాలి. కానీ గొడవలు సృష్టించడం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని పీసీసీ ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సిన అనుబంధ సంఘాలు ఇలాంటి వివాదాలతో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయని పీసీసీ విమర్శించింది.
అనుబంధ సంఘాల నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీ మార్గదర్శకాలను పాటించాలని పీసీసీ ఆదేశించింది.



