కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బీ క్రిష్ణ జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలో నిర్వహించే పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొంటాడు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన అండర్-14 బాలుర రగ్బీ విభాగంలో క్రిష్ణ తన ప్రతిభను చాటాడు. ఈ విషయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు.
ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఎంబీ హోమ్స్‌లో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బీ క్రిష్ణ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సత్యం తెలిపారు.
క్రిష్ణ ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీ కమల సంతోషం వ్యక్తం చేశారు.



