యూకేలో చదువుకోవాలనుకునే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్ ఆఫర్ అంగీకరించే ముందే, డిపాజిట్ కట్టే ముందే, వీసాకు దరఖాస్తు చేసే ముందే ఒక విషయం సరిచూసుకోవాలి. తాము ఎంచుకున్న యూనివర్సిటీకి విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు 'స్టూడెంట్ స్పాన్సర్ లైసెన్స్' ఉందో లేదో యూకే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
యూనివర్సిటీలకు రంగుల రేటింగ్
యూనివర్సిటీలపై నిబంధనలను యూకే ప్రభుత్వం కఠినం చేసింది. వాటి పనితీరును బట్టి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రేటింగ్ ఇస్తోంది:
- ఆకుపచ్చ: వీసా తిరస్కరణ 4 శాతం లోపు, ప్రవేశాలు కనీసం 96 శాతం, కోర్సు పూర్తి చేసేవారు కనీసం 92 శాతం
- పసుపు: వీసా తిరస్కరణ 4 నుంచి 5 శాతం, ప్రవేశాలు కనీసం 95 శాతం, కోర్సు పూర్తి 90 నుంచి 92 శాతం
- ఎరుపు: ఇంతకంటే తక్కువ ప్రమాణాలున్న యూనివర్సిటీలు
తగ్గిన దరఖాస్తులు
హోమ్ ఆఫీస్ తాజా గణాంకాల ప్రకారం 2026 మొదటి ఆరు నెలల్లో భారత్ నుంచి స్టడీ వీసా దరఖాస్తులు గత ఏడాదితో పోలిస్తే 31 శాతం తగ్గాయి. జారీ అయిన వీసాలు 36 శాతం తగ్గగా, భారత విద్యార్థుల వీసా తిరస్కరణలు రెట్టింపయ్యాయి. దరఖాస్తులను వెనక్కి తీసుకోవడం 214 శాతం పెరిగింది.
ఫీజులు కట్టే ముందు యూనివర్సిటీ రీఫండ్ నిబంధనలు చదవాలని, వీసా వచ్చే వరకు డబ్బు తిరిగిరాని విమాన టికెట్లు, వసతి బుక్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీసా వచ్చాక కూడా స్పాన్సర్ జాబితాను మరోసారి సరిచూసుకోవాలని చెబుతున్నారు.




