పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ ఏర్పాట్లపై అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రశంసలు కురిపించింది. అక్టోబర్ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఈ బృందం తమ సంతృప్తిని వ్యక్తం చేసింది.
రిచర్డ్ డోనెల్లీ, జియాన్ఫ్రాంకో డి సికూ, సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ పాల్‌తో కూడిన ఈ నిపుణుల బృందం ప్రాజెక్టులోని కీలకమైన ఎర్త్-కమ్-రాక్-ఫిల్ (ECRF) డ్యామ్ నిర్మాణాన్ని ప్రత్యేకంగా పరిశీలించింది.
ఈ సమీక్షలో భాగంగా నిపుణులు 40 గంటల పాటు క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక చర్చలు జరిపారు. ఇందులో 13 గంటల పాటు ప్రాజెక్టు సైట్‌ను, టెస్టింగ్ సౌకర్యాలను సందర్శించారు.
ECRF డ్యామ్ గ్యాప్స్ 1, 2 వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను నిపుణులు పరిశీలించారు. నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలను సందర్శించి అక్కడ జరుగుతున్న టెస్టింగ్ ప్రక్రియలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
ECRF డ్యామ్, ఇతర ప్రాజెక్టు నిర్మాణాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడాన్ని, అలాగే నిర్మాణ, నాణ్యత నియంత్రణ ఏర్పాట్లను నిపుణుల బృందం అభినందించింది.
ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అంతర్జాతీయ నిపుణులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రాజెక్టుకు మరింత విశ్వసనీయత లభించింది.



