పులివెందులలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం పులివెందుల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు ఈ నోటీసును స్థానిక వైసీపీ కార్యాలయంలో అవినాశ్ రెడ్డికి అందజేశారు.
స్థానిక ఎన్నికల కారణంగా పులివెందులలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ఎలాంటి ర్యాలీలు, సభలు, నిరసనలు నిర్వహించకూడదని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.
పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటానికి సహకరించాలని పోలీసులు అవినాశ్ రెడ్డిని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడటమే ఈ నోటీసుల జారీ వెనుక ఉద్దేశమని పోలీసులు వివరించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు.



