ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ నవంబర్ నుంచి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనుంది. సన్నబియ్యం గన్నీ బ్యాగులపై ఈ కోడ్‌లను ముద్రించనున్నారు.

ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా బియ్యం సరఫరా, నిల్వ, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, అక్రమాలను నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

తొలి విడతలో ఐదు లక్షల టన్నుల బియ్యం పంపిణీ కోసం కోటి గన్నీ బ్యాగులకు క్యూఆర్ కోడ్‌లు వేయనున్నారు. ఈ కొత్త విధానాన్ని నవంబర్ నెల నుంచి ప్రారంభించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే మిల్లుల్లో ధాన్యం నిల్వలు, బస్తాల లెక్కల్లో తేడాలు రాకుండా ఫిజికల్ వెరిఫికేషన్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీనికి అదనంగా ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకురానున్నారు.